Kaizer News

అలంపూర్ ఆలయాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్య

అలంపూర్ ఆలయాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

· State - Telangana · prabhanews.com

బాల బ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆలయ ప్రాంగణంలో మొక్క నాటిన కిషన్‌రెడ్డి.. సమస్యలపై వినతులు స్వీకరణ అలంపూర్, ఆంధ్రప్రభ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం అలంపూర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి అలంపూర్‌లోని హరిత హోటల్‌లో బస చేసిన ఆయన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణతో కలిసి బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభం, మేళతాళాలతో వారికి ఘన స్వాగతం పలికారు. మొదట వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో మంత్రి ఇతర అతిథులతో కలిసి మొక్కను నాటారు. ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి, అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ క్షేత్ర విశిష్టతను మంత్రి, ఇతర అతిథులకు వివరించారు. ఆలయ దర్శనం అనంతరం హరిత హోటల్‌కు చేరుకున్న కిషన్‌రెడ్డిని జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు కలిశారు. ఆయా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జోగులాంబ రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురంధర్, అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News