దట్నూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలో నిర్మాణం పూర్తికాని అంబేద్కర్ సంఘ భవనాలను పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని మంత్రి అన్నారు. ప్రపంచం కొనియాడిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనలతో దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖకు బకాయి ఉన్న రూ.100 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా యువతకు ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకు ధర్మపురి నియోజకవర్గంలో సమీకృత నివాస పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల మంజూరు చేయించినట్లు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ఉన్నతంగా రాణించాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దట్నూర్ గ్రామంలో వంతెన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెక్కం గంగారాం, గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, జగిత్యాల జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్‌రావు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమాడ్లు, గొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు