మెదక్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల (మెదక్) వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి నుంచి పాదయాత్రగా కలెక్టరేట్‌కు బయల్దేరారు. అక్కడ జిల్లా కలెక్టర్‌కు ఆమె వినతిపత్రం అందజేయనున్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి – పిల్లికొట్టాల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టకుండా ఆ నిధులను రద్దు చేసిందని విమర్శించారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణం కోసం ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు