హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తీసుకొని అందులో ఉండని లబ్ధిదారులపై చర్యలకు హౌసింగ్ కార్పొరేషన్ రెడీ అయింది. ఇండ్లలో ఉండని లబ్ధిదారులకు గతంలోనే నోటీసులు ఇవ్వగా... తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఇండ్లలో ఉండాల్సిందేనని, లేకపోతే ఇండ్లను స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేసింది. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మించిన డబుల్ ఇండ్ల కాలనీల్లోని లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోని 16 ప్రాంతాల్లో 3,900 మందికి నోటీసులు ఇచ్చినట్లు కార్పొరేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. వీటి కోసం సుమారు రూ. 9,100 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఇప్పటివరకు 60 వేల ఇండ్లు పూర్తయినట్లు తెలుస్తోంది. పూర్తైన ఇండ్లకు పలు విడతలుగా డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కొందరు లబ్ధిదారులు అలంకారప్రాయంగా మార్చుకున్నారు. "ఎలాగూ ఇల్లు వచ్చింది కదా.. ఎప్పుడైనా వెళ్లొచ్చు" అనే ఆలోచనతో ఇండ్లకు తాళాలు వేసి వేరే చోట అద్దెకు ఉంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 10 వేల నుంచి 15 వేల ఇండ్లలో లబ్ధిదారులు ఉండడం లేదని, వాటిని తాళాలు వేసే ఉన్నాయని అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల్లో బయటపడింది. దీంతో ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో ఉండకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రతాపసింగారం వంటి మేజర్ ప్రాజెక్టుల్లో ఇండ్లు పొంది, ఏడాది దాటినా ఖాళీగా ఉంచిన వారిని గుర్తించి తాజాగా 'తుది నోటీసులు' జారీ చేశారు. నోటీసు అందిన వారు 90 రోజుల్లోపు ఇంట్లోకి మారాలని, లేకపోతే కేటాయింపును రద్దు చేసి ఆ ఇంటిని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అర్హులైన పేదలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. గతంలో డబుల్ ఇండ్లు పొందిన వారిలో చాలా మంది పాతబస్తీ, అంబర్‌పేట్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి ప్రతాప సింగారం, కొల్లూరు వంటి శివారు ప్రాంతాల్లో ఇండ్లు కేటాయించారు. దీంతో పిల్లల చదువులు దెబ్బతింటాయని, రవాణా సౌకర్యాలు లేవంటూ ఆ ఇండ్లలోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. మరికొందరు తమకు వచ్చిన ఇంటిని ఇతరులకు అద్దెకు ఇవ్వడం గానీ, అమ్మేయడానికి గానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి 2024లోనే మొదటి విడత నోటీసులు ఇచ్చారు. తాజాగా జారీ చేసిన నోటీసును 'చివరి అవకాశం'గా భావించాలని, ఇకపై ఎలాంటి కారణాలు చెప్పినా వినే ప్రసక్తే లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. నోటీసుల గడువు ముగియగానే ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేసి, ఖాళీగా ఉన్న ఇండ్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 12.5 లక్షల మంది డబుల్ ఇండ్ల కోసం అప్లై చేశారు. ఇందులో 6 లక్షల మంది అర్హులు ఉంటారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో నిర్మించిన 2,500