Kaizer News

ఆర్‌-9 ఎత్తిపోతల పథకం పైపులైన్‌ పనులు ముమ్మరం

ఆర్‌-9 ఎత్తిపోతల పథకం పైపులైన్‌ పనులు ముమ్మరం

· State - Telangana · prabhanews.com

రూ.28 కోట్లతో ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణం.. పనులు పూర్తయితే 4,500 ఎకరాలకు సాగునీరు కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా మునగాల, నడిగూడెం మండలాల పరిధిలో సాగర్‌ ఎడమ ప్రధాన కాలువపై నిర్మించిన ఆర్‌-9 ఎత్తిపోతల పథకం పైపులైన్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా రామాపురం, కృష్ణానగర్‌, ఈకేపేట, తెల్లబల్లి, కోదండరామాపురం, ఆకుపాముల, నరసింహపురం, ముకుందాపురం, బరాకత్‌గూడెం, మునగాల, ఈకేపేట తండా గ్రామాలకు చెందిన 4,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయకట్టు రైతులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆశ్రయించడంతో ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసింది. పైపులైన్‌ నిర్మాణం కోసం సేకరించిన భూములకు రైతులకు పరిహారం కూడా అందజేశారు. నిధులు మంజూరు కావడంతో మెగా ఇంజనీరింగ్‌ వర్క్స్‌ ఆధ్వర్యంలో నెల రోజులుగా ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అవసరమైన పైపులను పెద్దఎత్తున డంపింగ్‌ చేయడంతో పాటు తుప్పు రాకుండా కోటింగ్‌ పనులు కూడా వేగంగా చేపడుతున్నారు. పనులు పూర్తయితే నిర్దేశించిన 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు సాగర్‌ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. పథకాలను ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించి, అవసరమైన సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి చివరి భూముల వరకు సాగునీరు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News