కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు నందివాడ, ఆంధ్రప్రభ: నందివాడ పోలీస్‌స్టేషన్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఐపీఎస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, వివిధ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే 112 కాల్స్‌కు పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని ఎస్పీ సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసుపై నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ట్రాఫిక్ హెచ్చరిక బోర్డులు, డ్రమ్ములు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలని నందివాడ ఎస్‌ఐ పి.ఎస్.వి. సుబ్రహ్మణ్యానికి సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో గుడివాడ ఎస్‌డీపీఓ పాల శ్రీనివాసు ఏపీపీఎస్, గుడివాడ రూరల్ సీఐ ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు, నందివాడ ఎస్‌ఐ పి.ఎస్.వి. సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు