హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్‌లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది. అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం పదో షెడ్యూల్‌లోని 2(1)(ఎ) పరిధిలోకి వస్తుందని ధర్మాసనం తేల్చింది. పదో షెడ్యూల్ కింద ఎమ్మెల్యేపై అనర్హతను నిర్ణయించేటప్పుడు శాసనసభలో సభ్యుడి ప్రవర్తనకే పరిమితం కావాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా లేదా అన్నది నిర్ణయించేందుకు అసెంబ్లీ వెలుపల ఆయన చేపట్టిన రాజకీయ కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. ఈ విషయంలో డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న డివిజన్ బెంచ్.. ఒక పార్టీ తరఫున ఎన్నికై శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి మరో పార్టీ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే మొదటి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణించవచ్చని పేర్కొంది. పదో షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తారని.. ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదని, న్యాయ సమీక్ష చేయవచ్చునని స్పష్టం చేసింది. పదో షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని, అందువల్ల సభ్యుడి సభలోని ప్రవర్తనతోపాటు బయట జరిగిన సంబంధిత చర్యలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సభ వెలుపల జరిగిన చర్యలను పరిగణనలోకి తీసుకోలేమన్న స్పీకర్ అభిప్రాయం చట్టపరంగా నిలబడదని