Nepal Floods | న్యూయార్క్/హైదరాబాద్, ఆగస్టు 30( నమస్తే తెలంగాణ ) : నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యుల్లో హైదరాబాద్‌కు చెందిన తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని తెలిసి అమెరికా పౌరుడు, భారతీయ సంతతికి చెందిన దీపక్ దండు కన్నీటిపర్యంతమయ్యారు. వరదల అనంతరం ఆమెతో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన.. భార్య ఆచూకీ కోసం భారత్‌కు బయలుదేరారు. దీపక్ దండు భార్య శ్రీదేవి వెజెల్లా కైలాస మానస సరోవర్ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో నేపాల్-టిబెట్ సరిహద్దులోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఈషా ఫౌండేషన్‌కు చెందిన బృందం ఉండగా భారీ వరద పోటెత్తింది. మట్టి, రాళ్లు, వరదనీరు ఒక్కసారిగా ఇమ్మిగ్రేషన్ భవనాన్ని చుట్టుముట్టి కొట్టుకుపోయినట్లు సమాచారం. శ్రీదేవితో మంగళవారం వరకు తాను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నానని దీపక్ దండు తెలిపారు. ఆమె తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు చివరిసారిగా తనకు సమాచారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళన మరింత పెరిగిందని చెప్పారు. శ్రీదేవి, దీపక్ దండు దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీదేవితో కలిసి అతడు హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యుల వద్దే ఉండిపోయాడు. ప్రస్తుతం తన కుమారుడు కూడా వార్తలు విని తీవ్రంగా కలత చెందుతున్నాడని దీపక్ తెలిపారు. తన భార్యకు కైలాస మానస సరోవర్ యాత్ర చేయాలన్నది ఎన్నాళ్ల నుంచో ఉన్న కోరిక అని దీపక్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు. ‘‘ఆమెతో కలిసి నేనూ యాత్రకు రావాల్సింది. కానీ వీలు కాలేదని’’ పేర్కొన్నారు. శ్రీదేవి ఆచూకీ కోసం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపారు. కుమారుడికి అండగా ఉండటంతో పాటు భార్య గురించి సమాచారం తెలుసుకునేందుకు భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్ భవనం లోపలే ఉన్నారని, వరదలకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమైందన్నారు. భారీ యం త్రాలతో ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని దీపక్ తెలిపారు