ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేపాల్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ ప్రాంతంలో వరద బీభత్సానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉప్పొంగిన వరద నీరు గ్రామాలపై విరుచుకుపడటంతో అనేక ఇళ్లు దట్టమైన బురదతో కప్పుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతినగా, వంతెనలు ధ్వంసమయ్యాయి. నది ఒడ్డున భారీగా శిథిలాలు, చెత్తాచెదారం పేరుకుపోయింది. వరద తగ్గిన తర్వాత కూడా బాధిత ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. గ్రామాలన్నీ బురదమయంగా మారడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. వరదల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంతసేపు నిలిచిపోయిన గాలింపు, సహాయక చర్యలను అధికారులు తిరిగి ప్రారంభించారు. దాదాపు 3 వేల మంది గల్లంతైన వారి జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. సహాయక బృందాలు, స్థానిక అధికారులు కలిసి ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు