Kaizer News

నడిరోడ్డుపై హత్యలు.. వరుస నేరాలతో సిటీలో భయాందోళనల

నడిరోడ్డుపై హత్యలు.. వరుస నేరాలతో సిటీలో భయాందోళనలు

· City - Hyderabad · ntnews.com

జనసంచారం మధ్య బహిరంగ హత్యలు నిందితుల్లో ‘అధికార’ నాయకుల అనుచరులు నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. వరుసుగా జరుగుతున్న నేరాలు-ఘోరాలతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. కత్తులతో వికృత క్రీడ చేస్తున్న నేరస్తులు నడిరోడ్డుపై నరమేధం చేస్తున్నా.. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదంటూ.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై హత్యలు.. హత్యాయత్నాలు చేస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్న నేరగాళ్లను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. మొద్దు నిద్రలో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకు శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పి రౌడీమూకల చేతుల్లోకి వెళ్తున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాడంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు సైతం శాంతి భద్రతల విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం తెలంగాణలో దిగజారుతున్న శాంతి భధ్రతలకు నిదర్శనంగా నిలుస్తోంది. జనసంచారం మధ్య జరిగిన బహిరంగ హత్యలతో విజిబుల్‌ పోలీసింగ్‌ ప్రశ్నార్ధకంగా మారింది. రౌడీమూకలు, గంజాయి బ్యాచ్‌లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండదండలతో ముఠా కక్షలు, భూ దందాలు రాజ్యమేలుతుండగా సామాన్య పౌరుడు శాంతి భద్రతల వ్యవస్థపై పూర్తిగా నమ్మకం కోల్పోతున్నాడు. పగటి పూట హత్యలు, భూ దందాలు, ముఠా కక్షలు పెరిగిపోతుంటే ఇంటెలిజెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఓటీ వంటి ప్రత్యేక పోలీస్‌ విభాగాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికే ప్రభుత్వం వాడుకుంటుందనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్సించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుతూ.. శాంతి భధ్రతలను పూర్తిగా గాలికొదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News