Kaizer News

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి

· City - Hyderabad · prabhanews.com

ఓవర్‌లోడ్‌ ఫీడర్లను గుర్తించి సామర్థ్యం పెంచాలి: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఈ బాలస్వామి నల్లగొండ, ఆంధ్రప్రభ : వాతావరణ పరిస్థితులతో పాటు విద్యుత్‌ సరఫరాలో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని జిల్లా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ రూరల్‌ జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ యు. బాలస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం నల్లగొండ విద్యుత్‌ శాఖ రెస్ట్‌హౌస్‌లో జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరా పరిస్థితి, పెండింగ్‌ పనులు, నూతన విద్యుత్‌ ఉపకేంద్రాల నిర్మాణ పురోగతి, విద్యుత్‌ బకాయిల వసూళ్లపై సమీక్షించారు. పెరుగుతున్న విద్యుత్‌ బకాయిలను వసూలు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని బాలస్వామి సూచించారు. 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ ఫీడర్లలో ఓవర్‌లోడ్‌ ఉన్న వాటిని గుర్తించి బైఫర్కేషన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓవర్‌లోడ్‌ ఉన్న 11 కేవీ ఫీడర్లలో యుద్ధప్రాతిపదికన లైన్‌ సామర్థ్యాన్ని పెంచి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. నూతన విద్యుత్‌ ఉపకేంద్రాల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్‌ఈ శ్రీనివాస్‌, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లకు చెందిన డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సబ్‌ ఇంజనీర్లు, అకౌంట్స్‌ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News