Kaizer News

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో జాతీయ క్రీడా దినోత్సవ

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు!

· National - India · hmtvlive.com

Jangaon: శనివారం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత హాకీ దిగ్గజం, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ 121వ జయంతి వేడుకలను జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్ చంద్ భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడని అన్నారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ప్రపంచ హాకీ చరిత్రలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ జీవిత ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మేజర్ ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారత హాకీ జట్టు 1928లో ఆమ్‌స్టర్‌డామ్, 1932లో లాస్ ఏంజెల్స్, 1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌లలో వరుసగా మూడు స్వర్ణ పతకాలు సాధించి, ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిందని కలెక్టర్ గుర్తు చేశారు. అసాధారణ నైపుణ్యం, బంతిపై అద్భుత నియంత్రణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనను “విజార్డ్ ఆఫ్ హాకీ”గా గౌరవించారని తెలిపారు. క్రీడలు కేవలం పతకాల కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు, క్రమశిక్షణకు, జట్టు భావనకు పునాది వేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, అకడమిక్స్‌తో పాటు క్రీడల్లో రాణించడం ద్వారానే సమగ్ర వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుందని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమ ఉంటే ఏ రంగంలోనైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని మేజర్ ధ్యాన్ చంద్ జీవితం మనకు నేర్పుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కనీసం ఒక క్రీడ (లేదా) శారీరక వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇది ఎంతో అవసరమన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంబిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, అధికారులు, మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. తదనంతరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని అథ్లెటిక్స్ విభాగంలో 100, 400, 800 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్, షాట్‌పుట్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించగా, ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతకాలు, జ్ఞాపికలను ప్రదానం చేసి, అభినందించారు. అదే విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గాను వారు క్రీడా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహరావు, అధికారులు, యువజనులు, క్రీడాకారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News