తాను రాకముందే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై ఆగ్రహం.. కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఖైరతాబాద్ గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. తనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వకుండా, తాను కార్యక్రమానికి చేరుకునేలోపే లక్కీ డ్రాను ప్రారంభించడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ నిబంధనలను పట్టించుకోకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న లక్కీ డ్రాకు ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన చేరుకునేలోపే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇచ్చిన విధానం, ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజాప్రతినిధి వచ్చే వరకు వేచి చూడకుండా లక్కీ డ్రాను ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో కార్యక్రమ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులతో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన దానం నాగేందర్, కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో లక్కీ డ్రా కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది