హైదరాబాద్ నగరం మరో కీర్తి కిరీటం దక్కించుకోనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు అహ్మదాబాద్ వేదికగా ఉన్న ఈ రికార్డును హైదరాబాద్ అధిగమించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. బీసీసీఐకు ప్రతిపాదనలు పంపింది. దాదాపు వంద ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని తల పెట్టిన ఈ స్టేడియం కోసం స్థలం సైతం గుర్తించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారు. ఈ భారీ స్టేడియాన్ని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో విస్తరణ కేంద్రంగా మారనున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ప్రణాళికల్లో భాగంగా ఈ స్టేడియాన్ని ప్రతిపాదన చేసారు. ప్రధాన రహదారి మార్గాలతో అనుసంధానం ఉండేలా ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది. కొండా సురేఖ పై మారిన కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన - ఇలా చేద్దాం..!? బీసీసీఐ ఖర్చు.. డిసెంబర్ లో శంకుస్థాపన ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (1,32,000 సీటింగ్ సామర్థ్యం) ఉంది. దీనిని మించిపోయేలా ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుండగా, నిర్మాణ, నిర్వహణ వ్యయాలను బీసీసీఐ భరించనుంది. ఫ్యూచర్ సిటీలో రానున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్‌లో ఈ క్రీడా ప్రాంగణం ఒక కీలక ఆకర్షణగా నిలవనుంది. కేవలం క్రికెట్‌కే కాకుండా, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ సంగీత కచేరీలు (కాన్సర్ట్‌లు) నిర్వహించేందుకు వీలుగా దీనిని మల్టీపర్పస్ వేదికగా తీర్చిదిద్దనున్నారు. భారీ అంతర్జాతీయ మ్యాచ్‌లు, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించగల సామర్థ్యంతో స్టేడియం ఏర్పడితే హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది