Kaizer News

Chirag Paswan Vs Jitan Manjhi | ఎస్సీ కోటా వివాదం.

Chirag Paswan Vs Jitan Manjhi | ఎస్సీ కోటా వివాదం.. జితన్‌ మాంఝీ రాజీనామా చేయాలన్న చిరాగ్ పాశ్వాన్

· National - India · ntnews.com

పాట్నా: బీహార్‌కు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల మధ్య ఎస్సీ కోటాపై వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జితన్‌ రామ్‌ మాంఝీ, ఆయన కుమారుడు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. (Chirag Paswan Vs Jitan Manjhi) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలైన బీహార్‌కు చెందిన కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ (రామ్ విలాస్), మరో కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఎఎం(ఎస్) మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, అత్యంత వెనుకబడిన దళిత వర్గాలలో ఒకటైన ‘ముషాహర్’ సామాజిక వర్గానికి చెందిన జితన్‌ మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం, ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థలోనే ఎస్సీ, ఎస్టీలకు ఉప కోటాలను సమర్థించింది. అత్యంత బలహీన, చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చూడటానికి సమీక్ష అవసరమని మాంఝీ కుమారుడైన బీహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ అభిప్రాయపడ్డారు. ‘రిజర్వేషన్ల రద్దు గురించి మేం మాట్లాడటం లేదు. రిజర్వేషన్లను మరింత న్యాయబద్ధంగా, సమర్థవంతంగా మార్చడం గురించి, అణగారిన వర్గాలకు అవి వాస్తవంగా చేరేలా చూడటం గురించి మేం మాట్లాడుతున్నాం’ అని ఆయన అన్నారు. అలాగే పాశ్వాన్, రవిదాస్ వంటి కొన్ని వర్గాలకే దళిత రిజర్వేషన్ల ప్రయోజనాలు పరిమితమయ్యాయని సంతోష్ కుమార్ సుమన్ ఆరోపించారు. అదే సమయంలో అనేక ఇతర దళిత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. తన ముషాహర్ వర్గానికి చెందిన ఒక్కరు కూడా ఐఏఎస్ అధికారి కాలేదని ఆయన ఎత్తిచూపారు. మరోవైపు కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ (రామ్ విలాస్), ఎస్సీ వర్గంలో ఉప కోటాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి మాంఝీ కుమారుడైన బీహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ వాదనను శనివారం ఆయన ఖండించారు. ‘క్రీమీ లేయర్ ఎందుకు ఉండకూడదని అడిగేవారు ముందుగా రిజర్వేషన్ ప్రయోజనాలను వదులుకోవాలి. జితన్‌ రామ్ మాంఝీ క్రీమీ లేయర్ భావనను నమ్మితే, ఆయన ముందుగా రాజీనామా చేయాలి. ఆయన కుమారుడు కూడా రాజీనామా చేయాలి’ అని మీడియాతో అన్నారు. కాగా, ఎస్సీలలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉన్నాయని చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఆర్థిక ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్‌ను నిర్ణయించడానికి రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్‌లో ఉప-కోటాలు లేదా క్రీమీ లేయర్‌ను ప్రవేశపెట్టడం వల్ల సామాజిక న్యాయం అసలు ఉద్దేశ్యాన్నే దెబ్బతీస్తుందని, సామాజిక న్యాయం కోసం చేసే పోరాటం అర్థరహితం అవుతుందని చెప్పారు. అప్పుడు దళితులు వివక్షను ఎదుర్కొంటూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్థిక ప్రమాణాల ఆధారంగా వారు ఇప్పటికీ ఒక ఉన్నత వర్గాన్ని కోరుకుంటే, అప్పుడు ఆయనే (మాంఝీ) మొదటగా తప్పుకోవాలి’ అని మరోసారి అన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News