Kaizer News

Mohan Bhagwat | క‌ర్మ‌భూమికి విధేయంగా ఉంటూనే జ‌న్మ

Mohan Bhagwat | క‌ర్మ‌భూమికి విధేయంగా ఉంటూనే జ‌న్మ‌భూమిని మ‌రిచిపోవ‌ద్దు : మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

· National - India · ntnews.com

Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కీలక సందేశం ఇచ్చారు. ప్ర‌వాస భార‌తీయులు వారు నివసిస్తున్న, పనిచేస్తున్న దేశానికే (కర్మభూమి) సంపూర్ణ విధేయతతో ఉండాలని చెప్పారు. అయితే క‌ర్మ‌భూమికి విధేయంగా ఉంటూనే జ‌న్మ‌భూమిని కూడా గుర్తుంచుకోవాల‌ని, మ‌రిచిపోవ‌ద్ద‌ని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ.. “మీరు అమెరికాలో ఉన్నారు. ఇక్కడే జీవిస్తున్నారు, ఇక్కడే సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు అమెరికాకు నిజాయతీగా మెలగాలి” అని స్పష్టంచేశారు. అదే సమయంలో భారత్ వారి జన్మభూమి అని గుర్తుచేశారు. కర్మభూమిపట్ల తమ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత, జన్మభూమి అయిన భారత్‌కు సేవ చేసేందుకు వారికి అవకాశం ఉందని, అది నిషిద్ధం కాదని చెప్పారు. ఈ విధంగా ప్రవాసులు తమ విధేయత, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయుల డీఎన్ఏలోనే ఉందని భగవత్ అన్నారు. అమెరికాను ప్రస్తావించినప్పుడు ‘బహుళత్వం’ అనే పదం వస్తుందని, అదే భారత్ గురించి మాట్లాడితే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మాట వినిపిస్తుందని చెప్పారు. ఈ ఏకత్వం, భిన్నత్వం రెండూ భారత ప్రజల రక్తంలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వం కారణంగానే ఏకత్వం మరింత శోభాయమానంగా ఉంటుందని, కాబట్టి దానిని మనం ఉత్సవంలా జరుపుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఉటంకిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే భారత్ విధి అని తెలిపారు. తన ప్రసంగంలో భగవత్ పలు తాత్విక అంశాలను కూడా ప్రస్తావించారు. భౌతిక సుఖాలు తాత్కాలికమని, అవి శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వలేవని అన్నారు. డోనట్స్ తినే ఉదాహరణను చెబుతూ.. ఒక దశలో ఎక్కువగా తిన్న తర్వాత వాటిపై ఆసక్తి పోతుందని, కానీ మళ్లీ కొంతకాలానికి తినాలనిపిస్తుందని వివరించారు. భౌతిక ఆనందం మితిమీరితే సంతృప్తినివ్వడంలో విఫలమవుతుందని చెప్పారు. దేహాలు, వస్త్రధారణ, పూజా విధానాలు వేరైనా మానవులంతా ఒకే ఆధ్యాత్మిక సూత్రంతో ముడిపడి ఉన్నారని అన్నారు. డబ్బు సంపాదన, భౌతిక విజయాలే జీవితంలో అంతిమ లక్ష్యాలు కాదని హితవు పలికారు. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంత పంచుతున్నామన్నదే ముఖ్యమ‌ని భ‌గ‌వ‌త్‌ అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో భౌతిక విజయాన్ని తిరస్కరించలేదని, పురుషార్థాలలో అర్థ, కామాలకు ప్రాధాన్యత ఉందని, అయితే వాటితోపాటు ఉన్నత లక్ష్యాలను కూడా సాధించాలని సూచించారు. వ్యక్తి, సమాజం, పర్యావరణం మధ్య సమతుల్యత అవసరమని, అన్నీ కలిసి అభివృద్ధి చెందినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు

Original source: ntnews.com
Read more on Kaizer News