సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ యురేనియం నుంచి వ్యాపారం వరకు కీలక ఒప్పందాలు నగరాల మధ్య సోదర బంధాలకు శ్రీకారం తాష్కెంట్, ఆంధ్రప్రభ : ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా తనకు లభించిన ఘన స్వాగతానికి ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి చిన్న అంశంలో కనిపించిన వ్యక్తిగత శ్రద్ధ, ఆతిథ్యం, రుచికరమైన విందు, ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తాష్కెంట్‌లో అడుగుపెట్టినప్పుడు భారతదేశంలో, ముఖ్యంగా గుజరాత్‌లో ఉన్నట్లుగా అనిపించిందని మోదీ భావోద్వేగంగా పేర్కొన్నారు. నగరమంతా భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించడం తనను ఎంతో ఆనందింపజేసిందని తెలిపారు. ఉజ్బెకిస్థాన్ 35వ స్వాతంత్ర్య దినోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్–ఉజ్బెకిస్థాన్ సంబంధాలకు మరింత విస్తృత రూపం ఇచ్చేలా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ దిశగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, భద్రత, వాణిజ్య రంగాల్లో సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు విదేశాంగ మంత్రుల స్థాయిలో ప్రత్యేక సమన్వయ మండలిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటివరకు కార్యదర్శుల స్థాయిలో ఉన్న సంయుక్త కమిషన్‌ను మంత్రుల స్థాయికి పెంచాలని నిర్ణయించడం కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌కు అవసరమైన యురేనియం సరఫరాకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునే అంశంపైనా చర్చలు జరిగాయి. ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భారత్, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో ప్రత్యేక వ్యాపార సదస్సు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతికత, మౌలిక వసతుల రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది. అలాగే మూడు నగరాలు, రాష్ట్రాల మధ్య సోదర సంబంధాల ఒప్పందాలకు శ్రీకారం చుట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహా అభివృద్ధి నమూనాలు, న్యూ తాష్కెంట్ వంటి ఆధునిక నగరాభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత భాగస్వామ్యానికి అవకాశాలను పరిశీలిస్తున్నారు