ఎస్‌సీవో సదస్సుకు మోదీ.. పుతిన్, జపారోవ్‌తో ద్వైపాక్షిక భేటీ.. భద్రత, అనుసంధానం, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రధాన చర్చలు ఆంధ్రప్రభ : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 26వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సెంట్రల్ ఆసియాలోని కిర్గిజ్‌స్తాన్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం బిష్కెక్ చేరుకున్న మోదీకి కిర్గిజ్‌స్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు. కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షుడు సదిర్ జపారోవ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆతిథ్య దేశాధ్యక్షుడు సదిర్ జపారోవ్‌తో పాటు పలువురు కీలక నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యమైన భద్రత, ప్రాంతీయ అనుసంధానం, స్థిరత్వం వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం వంటి సవాళ్ల నుంచి విముక్తి పొందిన ప్రాంతం కోసం సభ్య దేశాలతో కలిసి పనిచేయాలని భారత్ భావిస్తున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. 2001లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలతో ఎస్‌సీవో ఏర్పాటైంది. 2017లో భారత్, పాకిస్థాన్ పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరాయి. అనంతరం 2023లో ఇరాన్, 2024లో బెలారస్ సభ్యత్వం పొందాయి. ప్రస్తుతం 10 సభ్య దేశాలతో కొనసాగుతున్న ఈ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. కిర్గిజ్‌స్తాన్ పర్యటన సందర్భంగా పుతిన్‌తో మోదీ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సహకారం, ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే జపారోవ్‌తో భేటీలో భారత్-కిర్గిజ్‌స్తాన్ సంబంధాల బలోపేతంపై దృష్టి సారించే అవకాశం ఉంది