క్షేత్రస్థాయిలో సహాయకులతో విద్యుత్ మరమ్మతు పనులు దక్షిణ డిస్కంలో కొందరు సిబ్బంది పనితీరుపై విమర్శలు ప్రధాన అధికారులకు తెలిసినా పట్టింపు లేని పరిస్థితులు నెట్‌వర్క్ ఉన్నప్పటికీ సిబ్బంది కొరతతో తెరపైకి సహాయకులు విద్యుత్ స్తంభాలు ఎక్కే వారి సంఖ్య తక్కువైపోయిందంటున్న అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతంలోని షాబాద్ సెక్షన్‌లో అసిస్టెంట్ లైన్‌మెన్‌కు సహాయకుడిగా ఒక మైనర్‌ను పెట్టుకుని పనులు చేయించే క్రమంలో ఆ బాలుడు కరెంట్ షాక్‌తో చనిపోయారు. దీంతో అసిస్టెంట్ లైన్‌మెన్‌ను అక్కడి డీఈ సస్పెండ్ చేశారు. షాపూర్‌నగర్ సెక్షన్‌లో ఒక ఆర్టిజన్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కొంతకాలంగా విధులకు రావడం లేదు. ఈయన స్థానంలో మరోవ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ విషయం అధికారులకు తెలిసే జరుగుతోంది. మేడ్చల్ సర్కిల్‌లోని ఓ సెక్షన్లో ఒక ఆర్టిజన్ వద్ద ఐదారుగురు సహాయకులు పనిచేస్తున్నారు. నిజానికి వీరికి విద్యుత్ సంస్థతో సంబంధం లేదు. మరి జీతాలు ఎలా అంటే వినియోగదారుల నుంచి వసూలు చేసి న సొమ్ముల నుం చి ఇస్తారు. మరి ఆర్టిజన్ ఏం చేస్తారంటే నేతలతో తిరుగుతూ, పైరవీలు చేస్తూ దందాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా యి. గతంలో ఒకసారి మందలించినా మళ్లీ అదే రీతిలో తన సహాయకులను పెట్టుకుని పై స్థాయి అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు దక్షిణ డిస్కంలో చెప్పుకుంటారు. గత ఏడాది పాతబస్తీలో ఒక సహాయకుడు స్తంభంపైనే పనిచేస్తూ చనిపోయాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగరంలోని పది సర్కిళ్లలో క్షేత్రస్థాయిలో వేర్వేరు సెక్షన్లలో సహాయకులతో పనిచేయించే దందాను సిబ్బంది ఆపడం లేదు. కొందరు ఏఎల్‌ఎంలు, లైన్‌మెన్ల తీరు చూసి ఆర్టిజన్లు సైతం ఇదే బాట పడుతున్నారు. వయసు రీత్యా స్తంభాలు ఎక్కలేని పరిస్థితుల్లో తమకు సహాయకులుగా కొందరిని పెట్టుకోవడంతో వారే మొత్తం పనులు చేసి పెడ్తున్నారని కొన్ని రోజుల క్రితం వరకు డిస్కంలో ఒక్క సీఎండీ జితేశ్ పాటిల్‌కి మినహా అందరికీ తెలిసిన విషయమేనంటూ మింట్ కాంపౌండ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల సైబర్‌సిటీ సర్కిల్‌లోని షాబాద్‌లో జరిగిన సంఘటన తర్వాత సీఎండీ అన్ని సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ గట్టిగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మొదట కొన్నిరోజులు తమకు సహాయకులుగా ఉన్నవారిని కనిపించకుండా జాగ్రత్త పడ్డ కొందరు ఏఎల్‌ఎంలు, ఎల్‌ఎంలు,ఎల్‌ఐలు, ఆర్టిజన్లు వర్షాకాలంలో పనులు చేయాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోక మళ్లీ వారినే పెట్టుకుని పనులు చేస్తున్నట్లు తెలిసింది. అనధికారికంగా జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారం కార్పొరేట్ ఆఫీసులోని ఉన్నతాధికారులు మొదలు ఏఈవరకు అందరికీ తెలుసు అయినా వారేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే తమకు వచ్చే ఫిర్యాదులు, సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటే సిబ్బంది కావాలి. తక్కువ సిబ్బంది ఉండడంతో ఉన్నవారిని పనిచేయించలేక, బయటవారిని వద్దనలేక స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఒక సీని