భోపాల్: ఒక నిండు గర్భిణీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, చికిత్సపై ఆమె ఆందోళన చెందింది. ‘వీళ్లు నన్ను చంపేస్తారు. నన్ను ఇంటికి తీసుకెళ్లండి’ అని వేడుకున్నది. ప్రసవం తర్వాత ఆ మహిళతో పాటు శిశువు మరణించారు. (Woman, Child Die After Delivery) ఈ నేపథ్యంలో ఆమె ఆందోళనకు చెందిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హత్వా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కల్పన వివాహం తర్వాత తొలిసారి గర్భం దాల్చింది. తన మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆమె ఎంతో ఆశగా ఎదురుచూసింది. కాగా, ఆగస్ట్ 25న రాత్రి వేళ కల్పనకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. ఆగస్ట్ 26న రాత్రి సుమారు 8:30 గంటలకు ఆమెకు సిజేరియన్ నిర్వహించగా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్దిసేపటికే కల్పన, నవజాత శిశువు మరణించారు. మరోవైపు ప్రసవానికి ముందు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై కల్పన తీవ్ర ఆందోళన చెందింది. ఆమె ఏడుస్తూ తనను అక్కడి నుంచి తీసుకువెళ్లమని కుటుంబాన్ని దీనంగా వేడుకున్నది. ‘ఇలాంటి చికిత్స కొనసాగితే, వీళ్ళు నన్ను చంపేస్తారు. నేను బతకను. దయచేసి నన్ను కాపాడండి. నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది’ అని తన తల్లితో ఆమె అన్నది. నర్సింగ్ సిబ్బంది ఆమెను అడ్డుకోవడానికి, అక్కడే ఉండేలా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఒక దశలో ‘నీకు పిచ్చి పట్టిందా?’ అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్పనను ఆపరేషన్ థియేటర్‌లోకి లాక్కెళ్లారు. అయితే ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డ మరణించడంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స, వైద్యుల నిర్లక్ష్యంపై ఆమె కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడం ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. వైద్యపరమైన నిర్లక్ష్యానికి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చర్యలు తీసుకునే వరకు పోస్ట్‌మార్టం నిర్వహించడానికి నిరాకరించారు. దీంతో సుమారు నాలుగు గంటల పాటు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. చివరకు డీన్ డాక్టర్ సునీల్ అగర్వాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కల్పన కుటుంబ సభ్యులతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. జిల్లా ఆసుపత్రి వైద్యులతో పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఒప్పందం కుదిరింది. అలాగే ప్రాథమిక విచారణ ఆధారంగా విధుల్లో ఉన్న ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని కల్పన కుటుంబానికి హమీ ఇచ్చారు. అయితే ప్రసవానికి ముందు కల్పన ప్రాథేయపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది