Kaizer News

సీఎన్‌జీకి యుద్ధం సెగ..

సీఎన్‌జీకి యుద్ధం సెగ..

· National - India · prabhanews.com

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెస్ట్‌ ఆసియాలో మళ్లీ రాజుకున్న యుద్ధ మంటలు భారత వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సీఎన్‌జీ ధరలను ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.3.89 అదనపు భారం మోపింది. దీంతో ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు, సీఎన్‌జీ కార్ల వినియోగదారుల జేబుపై మరోసారి భారం పడనుంది. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.86.98కు చేరింది. గురుగ్రామ్‌లో రూ.92.01, ఘజియాబాద్‌, నోయిడాల్లో రూ.95.59గా కొత్త ధరలను నిర్ణయించారు. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. వెస్ట్‌ ఆసియా సంక్షోభం ముదరడం, హార్ముజ్‌ జలసంధి గుండా ఇంధన రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది. యుద్ధానికి ముందు పరిస్థితులతో పోలిస్తే అంతర్జాతీయంగా ద్రవీకృత సహజ వాయువు ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది. దేశంలో సీఎన్‌జీ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో అవసరాలకు తగ్గట్టుగా దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడాల్సి వస్తోందని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు వ్యయం పెరగడంతో ఆ ప్రభావం సీఎన్‌జీ ధరలపై పడిందని తెలిపింది. అయితే పెంచిన ధరల తర్వాత కూడా ఢిల్లీలో ఇతర ఇంధనాలతో పోలిస్తే సీఎన్‌జీ వినియోగం ఇప్పటికీ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయంగానే ఉంటుందని ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. హార్ముజ్‌ సంక్షోభ సమయంలో అంతర్జాతీయ గ్యాస్‌ ధరలు ఎగబాకినా, ఇప్పటివరకు సీఎన్‌జీ ధరలను వీలైనంత వరకు స్థిరంగా ఉంచామని సంస్థ తెలిపింది

Original source: prabhanews.com
Read more on Kaizer News