Kaizer News

ఆసియా కప్‌లో భారత్ శుభారంభం..

ఆసియా కప్‌లో భారత్ శుభారంభం..

· National - India · prabhanews.com

థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ విజయం.. షఫాలీ అర్ధశతకం, దీప్తి సంచలన బౌలింగ్ దుబాయ్, ఆంధ్రప్రభ : మహిళల ఆసియా కప్‌-2026లో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ అర్ధశతకంతో మెరిసి భారత్‌కు మంచి స్కోరు అందించగా.. అనంతరం బౌలర్లు విజృంభించి థాయ్‌లాండ్‌ను కేవలం 65 పరుగులకే కుప్పకూల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం అందించారు. అయితే స్మృతి రనౌట్ కావడంతో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ ధైర్యంగా ఆడి 18 బంతుల్లో 22 పరుగులు చేసింది. షఫాలీతో కలిసి రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించింది. షఫాలీ వర్మ తనదైన దూకుడు కొనసాగిస్తూ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 19వ అర్ధశతకాన్ని నమోదు చేసింది. అయితే ఒక దశలో భారత్ 108 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. తర్వాత వరుస వికెట్లు పడటంతో పరుగుల వేగం తగ్గింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు పరుగులకే వెనుదిరిగింది. థాయ్‌లాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమీ కీలకంగా రాణించింది. ఒకే ఓవర్‌లో షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. అయినప్పటికీ చివర్లో క్రాంతి గౌడ్ కేవలం ఎనిమిది బంతుల్లో అజేయంగా 15 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగుల స్కోరు నమోదు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ బ్యాటింగ్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. వికెట్ కీపర్ నన్నపట్ కొంచరోఎంకై ఒంటరి పోరాటం చేస్తూ 48 బంతుల్లో 41 పరుగులు చేసినా.. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరుకు కూడా చేరలేకపోయారు. దీంతో థాయ్‌లాండ్ 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. తన 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దీప్తి శర్మ బంతితో అద్భుతం చేసింది. డబుల్ వికెట్ మెయిడెన్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన ఆమె కేవలం 1.1 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. నందిని శర్మ 3/18తో రాణించగా, శ్రీ చరణి 2/10తో రెండు వికెట్లు తీసింది. క్రాంతి గౌడ్ కూడా వికెట్ సాధించింది. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ ప్రయాణాన్ని అత్యంత విజయవంతంగా ప్రారంభించింది. తదుపరి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు హాంకాంగ్‌తో తలపడనుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News