Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శనివారం ఉదయం సాంకేతిక సమస్యలు ఇబ్బందులు సృష్టించాయి. మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా డిజిటల్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు స్టేషన్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఆఫీసులు, విద్యాసంస్థలు, ఇతర పనులకు వెళ్లే సమయంలోనే సమస్య తలెత్తడంతో పలు స్టేషన్ల వద్ద రద్దీ పెరిగింది. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకున్నప్పటికీ గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు క్యూలలో నిలబడాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు తమ టికెట్లను చూపిస్తూ సిబ్బంది సహాయం కోరారు. మెట్రో ఆన్‌లైన్ సేవలకు అనుసంధానమైన సెన్సార్లలో సమస్య ఏర్పడినట్లు సమాచారం. దీంతో డిజిటల్ టికెట్లను గేట్ల వద్ద ధ్రువీకరించే ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా స్టేషన్‌లోకి ప్రవేశించే సమయంలోనే కాకుండా ప్రయాణం పూర్తయ్యాక బయటకు వెళ్లే దగ్గర కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సేవల్లో అంతరాయం ఏర్పడటంతో గేట్ల వద్ద పరిస్థితిని చక్కదిద్దేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వెంటనే సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మెట్రోలో డిజిటల్ టికెటింగ్‌ను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సాంకేతిక అంతరాయాలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా గేట్ల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్ వ్యవస్థల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. 2015లో జర్నలిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంతరం 2016 నుంచి పలు మీడియా సంస్థల్లో పనిచేశాను. మొదట ప్రింట్ ఆ తర్వాత డిజిటల్‌లో కలిపి మొత్తం 10 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఎక్కువగా లైఫ్‌స్టైల్, అంతర్జాతీయం, టెక్నాలజీ, బిజినెస్, ఆస్ట్రాలజీకి సంబంధించి వార్తలు రాస్తుంటాను