Kaizer News

ఆటుపోట్లకు ఆస్కారం!

ఆటుపోట్లకు ఆస్కారం!

· Business · ntnews.com

మార్కెట్‌ పల్స్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లు గతకొద్ది వారాలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ విజృంభిస్తుండటంతో మదుపర్ల కొనుగోలు సెంటిమెంట్‌ బలహీనపడుతున్నది. ఈ క్రమంలోనే లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ.. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 276.32 పాయింట్లు లేదా 0.35 శాతం పడిపోయి 77,264.51 వద్ద నిలిచింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 76.35 పాయింట్లు లేదా 0.31 శాతం కోల్పోయి 24,175.65 దగ్గర స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఆటుపోట్లకు ఆస్కారం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హొర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణా, గ్లోబల్‌ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారతీయ ఈక్విటీల కదలికలకు కీలకమని మెజారిటీ ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. ముఖ్యంగా హొర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరి కీలకమని చెప్పవచ్చు. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్‌ నినో సంబంధిత సమాచారం సైతం ప్రధానమే. మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే దిశగా అడుగులు పడితే.. మదుపర్లు కొనుగోళ్లకు పెద్దపీట వేసేందుకు ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఒకవేళ గల్ఫ్‌ దేశాల నడుమ సంక్షోభం ఛాయలు పెరిగితే మాత్రం బ్యాంకింగ్‌, ఆటో, ఆయిల్‌ షేర్లలో సెల్లింగ్‌ ప్రెషర్‌ కొనసాగవచ్చని అంటున్నారు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,300-24,500 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు. గమనిక.. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్‌ పల్స్‌

Original source: ntnews.com
Read more on Kaizer News