Kaizer News

అందంపై అధిక శ్రద్ధ

అందంపై అధిక శ్రద్ధ

· National - India · ntnews.com

జెన్‌-జీ యువత అందంపై అధిక శ్రద్ధ చూపుతున్నారు. చర్మ సంరక్షణను తమ దినచర్యలో భాగంగా మార్చుకుంటున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనుగోళ్లలోనూ వాళ్లే ముందువరసలో ఉంటున్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ కొనుగోలు చేస్తున్నవారిలో 56% మంది జెన్‌-జీకి చెందినవారేనని ఈ సర్వే వెల్లడించింది. వారిలో దాదాపు 70% మంది సోషల్‌ మీడియా ద్వారానే కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకుంటున్నారట. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, బ్యూటీ క్రియేటర్లు, యూట్యూబ్‌ రివ్యూలు, ఆన్‌లైన్‌ సిఫార్సులు.. యువత కొనుగోలు నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయట. అదే సమయంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కూడా వేగంగా విస్తరిస్తున్నదనీ, ఐదేండ్ల క్రితం కేవలం 8 శాతంగా ఉన్న ఆన్‌లైన్‌ బ్యూటీ ఖర్చు.. 2030 నాటికి దాదాపు 35 శాతానికి చేరుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. బ్యూటీ కేర్‌లో భాగంగా చర్మ సంరక్షణకు పెద్దపీట వేస్తుండగా.. బాడీ వాష్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఉత్పత్తుల కొనుగోళ్లు అధికం అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో బాడీవాష్‌ అమ్మకాలు ఏటా దాదాపు 60-65 శాతం చొప్పున, సన్‌కేర్‌ ఉత్పత్తుల అమ్మకాలు 55-60 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఫేస్‌ సీరమ్‌లు, క్లెన్సర్లు కూడా టాప్‌ ప్లేస్‌లో నిలుస్తున్నాయి. ఇక ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యూటీ కేర్‌ ఉత్పత్తుల గురించి సెర్చ్‌ చేస్తున్నవారిలో దాదాపు మూడింట రెండు వంతులు నాన్‌-మెట్రో ప్రాంతాల నుంచే వస్తున్నాయట. చిన్న నగరాల్లోని వినియోగదారులు కూడా కొత్త బ్యూటీ ట్రెండ్స్‌, ఉత్పత్తులను వేగంగా స్వీకరిస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. అదేసమయంలో.. నవతరంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా బ్యూటీపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ ఖర్చులను జీవనశైలి బడ్జెట్‌లో ముఖ్యమైన భాగంగా మార్చుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది

Original source: ntnews.com
Read more on Kaizer News