టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఓ యువ రైతు రాజకుమార్ వినూత్నంగా ఆలోచించాడు. తన వరి పంటను పక్షులు, అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ బీరు సీసాలను ఏర్పాటు చేశాడు. పొలంలో తాళ్లకు సీసాలను కట్టి అమర్చడంతో గాలికి అవి కదులుతూ శబ్దం చేస్తున్నాయి. దీంతో పక్షులు, అడవి పందులు పొలంలోకి రాకుండా ఉంటాయని రైతు భావిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో, అందుబాటులో ఉన్న వస్తువులతో పంటను రక్షించుకునేందుకు ఈ విధానాన్ని ప్రయోగిస్తున్నట్లు రాజకుమార్ తెలిపారు. సాధారణంగా రైతులు పంట రక్షణ కోసం వివిధ పద్ధతులను అనుసరిస్తుండగా.. ఈ యువ రైతు చేసిన వినూత్న ప్రయత్నం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అనుసరిస్తున్న స్థానిక ఆలోచనలకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది