Kaizer News

వీడియో పాఠాలు తప్పనిసరి!

వీడియో పాఠాలు తప్పనిసరి!

· City - Hyderabad · prabhanews.com

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై మూడు గంటల శిక్షణ తప్పనిసరి.. కూకట్‌పల్లి ఆర్టీఏ కొత్త విధానానికి శ్రీకారం హైదరాబాద్, ఆంధ్రప్రభ: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికి తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకురానుంది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే అభ్యర్థులను డ్రైవింగ్ పరీక్షకు అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కొత్త విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి రవాణా శాఖ కార్యాలయంలో అమలు చేయనున్నారు. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా మూడు గంటల పాటు వీడియో పాఠాలకు హాజరుకావాల్సి ఉంటుంది. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు, వాహనాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ఈ పాఠాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. వీడియో శిక్షణ పూర్తిచేసిన వారినే తదుపరి ట్రాక్ పరీక్షకు అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం లెర్నింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులు 30 రోజుల తర్వాత నుంచి ఆరు నెలల లోపు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నిర్వహించే ట్రాక్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాక్ పరీక్షల సౌకర్యం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో కూడా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన వీడియో పాఠాల మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్త విధానంలో అభ్యర్థులు వీడియో పాఠాలను నిజంగా వీక్షిస్తున్నారా లేదా అన్న అంశంపైనా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. పాఠాలు జరుగుతున్న సమయంలో అభ్యర్థుల ముఖకవళికలను నమోదు చేసే ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు సమాచారం. డ్రైవింగ్ పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం, నిబంధనలకు విరుద్ధమైన విధానాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రతి కొత్త డ్రైవర్‌కు రోడ్డు భద్రతపై కనీస అవగాహన ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూకట్‌పల్లి రవాణా శాఖ కార్యాలయంలో చేపట్టనున్న ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జోనల్ కార్యాలయాలకు విస్తరించే అవకాశముంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో మరో కీలక మార్పు రానుందని అధికారులు చెబుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News