Kaizer News

TVK vs Cong | కాబోయే ప్ర‌ధాని విజ‌య్ అంటూ జోరుగా ప

TVK vs Cong | కాబోయే ప్ర‌ధాని విజ‌య్ అంటూ జోరుగా ప్ర‌చారం.. అధికార కూటిమిలో క‌ల‌క‌లం..!

· National - India · ntnews.com

TVK vs Cong : తమిళనాడు (Tamil Nadu) లో అధికారంలో ఉన్న ‘తమిళగ వెట్రి కళగం (TVK)’, దాని మిత్రపక్షం కాంగ్రెస్ (Congress) మధ్య రాజకీయ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌ (CM Joseph Vijay) ని దేశానికి కాబోయే ప్రధానిగా కీర్తిస్తూ కొందరు టీవీకే నేతలు (TVK leaders), మద్దతుదారులు చేస్తున్న ప్రచారం కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్న‌ది. ఈ పరిణామంపై కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్‌ని ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తూ సాగుతున్న ఈ ప్రచారం వెనుక పార్టీ నాయకత్వాన్ని ఆకట్టుకోవాలనుకునే కొందరు టీవీకే నేతల ప్రయత్నం ఉన్నప్పటికీ.. ఇది కూటమి జాతీయ రాజకీయ వైఖరిపై గందరగోళం సృష్టిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్య‌క్తంచేస్తున్నారు. తొలుత అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్‌పై ప్రశంసలకే పరిమితమ‌య్యారు. కానీ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, ఉత్తర భారతదేశంలో ప్రచార వీడియోల రూపంలోకి విస్తరించింది. ఇది బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన సర్వే ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారని అడిగిన ప్రశ్నకు.. రాహుల్ గాంధీ తర్వాత 9 శాతం మద్దతుతో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. టీవీకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విజయ్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నేతలు అసహనంగా ఉన్నారు. మంత్రులు అభిమానుల్లా వ్యవహరిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ ఇటీవల చేసిన విమర్శలు ఈ అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. గతంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా సమర్థించిన డీఎంకేతో పొత్తును వదులుకుని కాంగ్రెస్ పార్టీ టీవీకేతో చేతులు కలుపడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ.. విజయ్ ప్రచారం ఒక ఎన్నికల వ్యూహమేనని, అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీకి ఎవరూ సాటిరారని స్పష్టంచేశారు. ఈ వివాదంపై శనివారం మధురైలో రాష్ట్ర మంత్రి నిర్మల్ కుమార్ స్పందిస్తూ.. విజయ్ ప‌ట్ల దేశవ్యాప్తంగా ప్రజలకు ఆకాంక్షలు ఉన్నాయని, రాజకీయ పరిస్థితులను బట్టి సీఎం విజయ్ సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీని ముందుంచి, దక్షిణాదిలో విజయ్ ప్రజాదరణను ఉపయోగించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కానీ తాజా పరిణామాలతో ఆ వ్యూహం దెబ్బతిని, కూటమి భవిష్యత్తు, నాయకత్వ ప్రాధాన్యతలపై నీలినీడలు కమ్మాయి

Original source: ntnews.com
Read more on Kaizer News