Kaizer News

ఇన్వెస్టర్లకు.. న్యూక్లియర్‌ ‘పవర్‌’

ఇన్వెస్టర్లకు.. న్యూక్లియర్‌ ‘పవర్‌’

· Business · sakshi.com

వచ్చే 20 ఏళ్లలో 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం ప్రస్తుతం దేశంలో అణు విద్యుదుత్పత్తి 8–9 గిగావాట్లే లక్ష్యాన్ని సాధించాలంటే ఏకంగా 10–11 రెట్లు పెరగాలి దీన్ని సాధించే క్రమంలో పలు కంపెనీలకు భారీ అవకాశాలు సౌర, పవన విద్యుత్తులా కాకుండా ప్రత్యేక కంపెనీలకే చోటు అణు విద్యుత్తు రంగాన కంపెనీలు... పోటీ కూడా తక్కువే వాచ్‌లిస్టులో పెట్టుకోవటానికి డజనుకు పైగా లిస్టెడ్‌ కంపెనీలు దీర్ఘకాల వ్యూహంతో ఇన్వెస్ట్‌ చేస్తే రివార్డు కూడా ఎక్కువే ‘న్యూక్లియర్‌ ఎకానమీ’పై సాక్షి వెల్త్‌ ప్రత్యేక కథనం సోలార్‌ విప్లవాన్ని చూశాం. డిఫెన్స్‌ తయారీ విస్ఫోటాన్నీ చూశాం. అవి సృష్టించిన విజేతలనూ చూశాం. ఎన్నో అవకాశాలు... ఎన్నెన్నో కంపెనీలు. కొత్తవి వచ్చాయి. పాతవీ ఎదిగాయి. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ‘వారీ రెన్యూవబుల్స్, వారీ ఎనర్జీ, కేపీఐ ఎనర్జీ, జీఈ వెర్నోవా, హిటాచీ ఎనర్జీ లాంటివి కళ్లు చెదిరే లాభాలనిచ్చాయి. దేశ సోలార్‌ ఎనర్జీ సామర్థ్యం ఏకంగా 150 గిగావాట్లకు చేరింది. కాకపోతే ఇది స్థాపిత సామర్థ్యం. దీని ద్వారా నికరంగా ఉత్పత్తయ్యేది 20 నుంచి 22 శాతం మాత్రమే. 30 నుంచి 33 గిగావాట్లు. డిఫెన్స్‌ కంపెనీలైతే చెప్పనక్కర్లేదు. రక్షణ రంగానికి చిన్న చిన్న పరికరాలు తయారు చేసే స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం ఏకంగా లార్జ్‌క్యాప్‌ స్థాయికి చేరాయి. ప్రభుత్వ రంగంతో సహా పలు కంపెనీలు మల్టీ బ్యాగర్‌ రాబడులనిచ్చాయి. ఇపుడు అణు విద్యుత్తు విషయానికొద్దాం. ప్రస్తుతం ఉత్పత్తవుతున్నది 8–9 గిగావాట్లు. కానీ వచ్చే 20 ఏళ్లలో 100 గిగావాట్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. సౌర, పవన విద్యుత్తుల మాదిరి కాకుండా ఈ ప్లాంట్లు 85–90% సామర్థ్యంతో నడుస్తాయి. కాబట్టి 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే 85–90 గిగావాట్ల నికర విద్యుత్తూ ఉత్పత్తవుతుంది. అంటే సోలార్‌కన్నా 3 రెట్లు ఎక్కువ. కాకపోతే ప్రస్తుత సామర్థ్యాన్ని ఏకంగా 10 రెట్లు పెంచాలి. మరి దానికెంత యురేనియం కావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కేంద్రాలు నిర్మించే సత్తా మనకుందా? ఎలాంటి పరికరాలు కావాలి? వాటిని తయారు చేసేదెవరు? ప్లాంట్లు నిర్మించేదెవరు? వీటిలో లాభపడే కంపెనీలేంటి? రాబోయే అవకాశాలేంటి? సోలార్‌కు 3 రెట్లుండే ఈ ‘న్యూక్లియర్‌ ఎకానమీ’లో భవిష్యత్తు విజేతలెవరు? ఇన్వెస్టర్లు దీన్నెలా తీసుకోవాలి? ఇదే ఈ ‘సాక్షి వెల్త్‌’ ప్రత్యేక కథనం.. అణు విద్యుత్తును థర్మల్‌లానే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయటం సాధ్యమేనా? అంటే... అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒక గిగావాట్‌ విద్యుత్‌కు ఏడాదికి 160–200 టన్నుల యురేనియం ఉంటే చాలు. శుద్ధిచేశాక వచ్చే 25–30 టన్నుల యురేనియం ఇంధనాన్ని అణు రియాక్టర్లలో నేరుగా వాడొచ్చు. అదే థర్మల్‌ విద్యుత్తుకైతే ఒక గిగావాట్‌కు ఏకంగా 3–4 మిలియన్‌ టన్నుల బొగ్గు కావాలి. అంటే 20వేల కిలోల బొగ్గు చేసే పనిని.. ఒక కిలో యురేనియం చేస్తుంది. కాబట్టి థర్మల్‌ మాదిరి నిరంతరం ప్లాంట్లకు గూడ్సు రైళ్లు తిరగక్కర్లేదు. ఏడాది, రెండేళ్లకోసారి ఇంధనాన్ని రవాణా చేస్తే చాలు. ఇక ప్రభుత్వం లకి‡్ష్యంచిన 100 గిగావాట్లకైతే ఏడాదికి 17,000 టన్నులు కావాలి. మరి అంత యురేనియం నిల్వలు మన దగ్గరున్నాయా? ఇదే అసలైన సవాలు.

Original source: sakshi.com
Read more on Kaizer News