Kanchili: కంచిలి తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా కంచిలి మండలం మకరాంపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెయ్యిల హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు, భారత హాకీ క్రీడకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ క్రీడ గొప్పతనాన్ని విద్యార్థులకు పరిచయం చేసేలా హాకీ స్టిక్, బంతి ఆకృతులను ప్రదర్శించారు