Kaizer News

ఖైరతాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న 69 అడుగుల బడా గణేశ

ఖైరతాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న 69 అడుగుల బడా గణేశ్!

· City - Hyderabad · prabhanews.com

ఈసారి ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ అవతారం.. సెప్టెంబర్ 12 నాటికి సర్వాంగ సుందరంగా సిద్ధం చేయనున్న ఉత్సవ కమిటీ సెప్టెంబర్ 14న వినాయక చవితి సెప్టెంబర్ 25న గణేశ్ నిమజ్జనం హైదరాబాద్, ఆంధ్రప్రభ: వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి భక్తులకు అత్యంత వైభవంగా ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. సుమారు 69 అడుగుల భారీ ఎత్తుతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహం ఇప్పటికే నగరవాసుల్లో, భక్తుల్లో ఆసక్తిని పెంచుతోంది. విగ్రహానికి సంబంధించిన ప్రధాన మట్టి పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. పంచముఖ రూపంలో స్వామివారి ముఖాలు, ఇతర శిల్ప ఆకృతులను అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. భారీ విగ్రహ నిర్మాణంలో ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తూ కళాకారులు శ్రమిస్తున్నారు. విగ్రహ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కర్రపూజ నిర్వహించారు. ఆ తర్వాత నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం మట్టి పనులతో పాటు స్వామివారి ముఖాలు, చేతులు, ఇతర అలంకార భాగాల రూపకల్పన కొనసాగుతోంది. మట్టి పనులు పూర్తయిన అనంతరం రంగుల అలంకరణ, తుది మెరుగులు దిద్దే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెప్టెంబర్ 12 నాటికి విగ్రహాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురావాలని ఉత్సవ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. భారీ ఎత్తు, ప్రత్యేకమైన పంచముఖ రూపం కారణంగా ఈసారి ఖైరతాబాద్ గణేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. భారీ విగ్రహం, విభిన్న రూపకల్పన, లక్షలాది మంది భక్తుల సందర్శనతో ఖైరతాబాద్ ప్రాంతం పండుగ రోజుల్లో ఆధ్యాత్మిక సందడితో కళకళలాడుతుంది. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న జరగనుండగా, ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగకు ఇంకా సమయం ఉండగానే విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతుండటంతో, ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి భక్తుల్లో రోజురోజుకూ పెరుగుతోంది

Original source: prabhanews.com
Read more on Kaizer News