Kaizer News

శిథిలాల కింద మరిన్ని విషాదగాథలు…

శిథిలాల కింద మరిన్ని విషాదగాథలు…

· National - India · prabhanews.com

పసి చెల్లెలిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న అన్న.. 55 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఖాట్మాండు, ఆంధ్రప్రభ : నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదలు, బురద ప్రవాహాల విషాదం నుంచి హృదయాన్ని పిండేసే ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎటు చూసినా శిథిలాలు.. బురదలో కొట్టుకుపోయిన ఇళ్లు.. తమవారి కోసం కన్నీరు పెట్టుకుంటున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఈ విషాదం మధ్య ఓ చిన్నారి తన చెల్లెలిని గుండెలకు హత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది. తనకే రక్షణ కావాల్సిన వయసులో ఆ చిన్నారి మాత్రం చెల్లెలికి రక్షణగా నిలిచాడు. చుట్టూ విధ్వంసం కనిపిస్తున్నా.. ఎక్కడ తమవారు ఉన్నారో తెలియకపోయినా.. త‌న చెల్లెలిని మాత్రం వదిలిపెట్టలేదు. ఆమెకు ఏమీ కాకూడదన్నట్లుగా ఒడిలో ఎత్తుకుని ముందుకు సాగుతున్నాడు. వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తన చెల్లెలిని గట్టిగా హత్తుకున్న ఆ బాలుడి దృశ్యం చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. తమ తల్లిదండ్రులు క్షేమంగా తిరిగి రావాలని, ఆ పిల్లలు మళ్లీ వారి ఒడికి చేరాలని పలువురు ప్రార్థిస్తున్నారు. ఇదే నేపాల్ విపత్తులో మరో అద్భుత ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నేపాల్-చైనా సరిహద్దు సమీపంలో బురద ప్రవాహం ముంచెత్తిన ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి శిథిలాల కింద చిక్కుకుంది. విపత్తు సంభవించి రెండు రోజులకుపైగా గడిచిపోయినా ఆమె ప్రాణాలతో ఉండటం సహాయక సిబ్బందినే ఆశ్చర్యానికి గురిచేసింది. శిథిలాల మధ్య నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడి సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బురదతో నిండిపోయిన‌ శిథిలాల మధ్య చిన్నారి ముఖం మాత్రమే కనిపిస్తుండగా, ఎంతో జాగ్రత్తగా ఆ చిన్నారిని బయటకు తీశారు. దాదాపు 55 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి ఘటనను ఓ మిరాకిల్ గా అభివర్ణిస్తున్నారు. ఆమె ముఖం, వీపుపై గాయాలైనప్పటికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. వెంటనే ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఖాట్మాండులోని ఆసుపత్రికి తరలించారు. రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో హెలికాప్టర్ ద్వారానే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ.. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనన్న ఆశతో సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. శిథిలాల కింద నుంచి మరిన్ని విషాద కథలు బయటపడుతున్నాయి. నేపాల్‌లో సంభవించిన ఈ విపత్తు ప్రతి కుటుంబం వెనుక తీరని వేదనను, కన్నీటి గాథను మిగిల్చింది. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తుండగా, సహాయక బృందాలు శిథిలాల మధ్య నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News