వావ్రే (బెల్జియం): హాకీ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భారత్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. శుక్రవారం వావ్రేలోని బెల్ఫియస్ హాకీ అరెనాలో జరిగిన హోరాహోరీ పోరులో ఆతిథ్య బెల్జియం జట్టు షూటౌట్‌లో 4–3 తేడాతో భారత్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవడంతో విజేతను తేల్చేందుకు షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరి క్షణంలో భారత జట్టు సాధించిన అద్భుతమైన గోల్‌తో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మొత్తం ఎనిమిది గోల్స్‌తో మెరిశాడు. అర్జెంటీనా ఆటగాడు డోమెనెతో కలిసి ఆయన టాప్ స్కోరర్ల జాబితాలో నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో అభిషేక్ గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. మన్‌ప్రీత్ సింగ్ అందించిన పాస్‌ను అభిషేక్ షాట్‌తో బెల్జియం గోల్‌కీపర్ వాన్ష్‌ను దాటించి గోల్ సాధించాడు. రెండో క్వార్టర్‌లో బెల్జియం వరుసగా 2 గోల్స్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రొమాన్ డువెక్సాట్(22వ నిమిషం), హ్యూగో లాబోచరే (23వ నిమిషం) గోల్స్ చేసి ఆతిథ్య జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించారు. ద్వితీయార్ధం ప్రారంభమైన వెంటనే భారత్ కౌంటర్ అటాక్ చేసింది. హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను అద్భుతమైన డ్రాగ్-ఫ్లిక్‌తో గోల్‌గా మలచి స్కోరును 2-–2తో సమం చేశాడు. నాలుగో క్వార్టర్‌లో బెల్జియం ఆటగాడు నికోలస్ డి కెర్పెల్ మరో గోల్ సాధించి స్కోర్‌ను 3–-3కి చేర్చాడు. మ్యాచ్ ముగియడానికి 26 సెకన్లుందనగా భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి గోల్ కొట్టి స్కోరును 3-–3తో సమం చేయడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. బెల్జియం తరఫున టామ్ బూన్, ఆర్థర్ డి స్లూవర్, అలెజాండ్రిక్ హెండ్రిక్స్, రొమాన్ డువెక్సాట్ గోల్స్ సాధించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ప్రపంచ కప్‌లో భారత్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా, ఆతిథ్య బెల్జియం ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది