ఫిరాయింపు వ్యవహారంతో గులాబీ పార్టీకి గుణపాఠం తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు పద్నాలుగేళ్ల ఉద్యమ నేపథ్యమున్న త్యాగధనుల అభిప్రాయమే భవిష్యత్తుకు కీలకం ఇకపై రాజకీయ వక్ర బుద్ధి నేతలను చేర్చుకుంటే సంస్థాగతంగా వ్యవస్థకే ముప్పు గెలిచే వాళ్లు కావాలన్న విధానం సరికాదు… ఉద్యమ పాఠశాల నుంచే నేతలుగా ఎదగాలి ఆర్‌ఎస్‌ఎస్ తరహా వ్యవస్థను బీఆర్‌ఎస్ అనుసరించాలంటున్న ఉద్యమకారులు, నిపుణులు గతంలోని విధానాలను విభేదిస్తున్న ఉద్యమ నేతలు… బీఆర్‌ఎస్‌లో బలపడుతున్న అంతర్గత చర్చ నిఖార్సయిన నేతలకే ప్రజల మద్ధతు… తమిళనాడులో నిరూపించిన సీఎం విజయ్ వచ్చే ఎన్నికల కోసం బలమైన భవిష్యత్ కార్యాచరణ అవసరమంటూ అధిష్టానంపై ఒత్తిడి ఖాళీ కానున్న ‘ఖైరతాబాద్’ పోరు నుంచే స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలనే డిమాండ్ ఉద్యమ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనకు సమయం ఆసన్నం.. కొనసాగుతున్న మేధోమదనం హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతల అభిప్రాయాలకు భిన్నంగా తీసుకునే నిర్ణయాలపై తెలంగాణ సమాజం విముఖత వ్యక్తం చేస్తోంది. వెనకబడిన తెలంగాణాను పురోగతి వైపు నడిపించడమే లక్ష్యంగా, ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్నాయాన్ని ఎదురించి సుస్థిరత సాధించడమే ధ్యేయంగా పుట్టిన ఉద్యమ పార్టీలో క్రమక్రమంగా బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ) ఆగడాలు పెరిగిపోవడాన్ని నిఖార్సయిన ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కోవకు చెందిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తే… భవిష్యత్ పరిణామాలు ప్రతికూలంగా మారుతాయన్న హెచ్చరికలు వినవస్తున్నాయి. తాజాగా పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన అనంతర పరిణామాలు కీలక మార్పును కోరుకుంటున్నాయి. రాజకీయంగా అనేక ఆటుపోట్లను అధిగమించిన ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో సంస్థాగత ప్రక్షాళన అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వందలాది మంది ఉద్యమ నేతల త్యాగాలను మరిచి, ఉద్యమ భావజాలాన్ని విడిచి రాజకీయ వ్యూహాల్లో పైచేయి సాధించడం కోసం, తాత్కాళిక ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలకు ప్రాధాన్యత ఇస్తే.. ఉపేక్షించేది లేదన్న సంకేతాలు క్షేత్రస్థాయి నుంచి బలపడుతున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడాన్ని తెలంగాణ వాదులు గర్హిస్తున్నారు. బీఆర్‌ఎస్ భవిష్యత్తుకు ‘బీటీ’ బ్యాచ్‌తో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించి పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం మొదలుకుని పార్టీ పట్ల నిబద్ధతను చాటుతున్న నేతలకు, సామాజిక అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేసే నేతలకు తగిన ప్రాధాన్యత దక్కాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. తాజా పరిణామాలతో అందుకు అన్ని వర్గాల నుంచి మద్ధతు పెరగుతోంది. తాము చేసింది తప్పేనని నిరూపితమైన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంతో గులాబీ పార్టీకి గుణపాఠం కావాలంటూ రాజకీయ పండితులు, సామాజిక విశ్లేషకులు భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేస్తు