ఆప్తులను కోల్పోయిన బాధలోనూ.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి అవయవ దానంతో ఎనిమిది మంది ప్రాణాలు నిలబడ్డాయని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. తమ ఆప్తులను కోల్పోయిన తీవ్ర దుఃఖంలోనూ అవయవ దానానికి అంగీకరించిన రెండు కుటుంబాలు మానవత్వాన్ని చాటుకున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల పద్మ అండాలు ‘బ్రెయిన్ డెడ్’ (మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోవడం) అయినట్లు నిర్ధారించారు. తమవారిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, వారి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చినట్లు సీపీ తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన కామారెడ్డికి చెందిన టెక్కీ కుడిక్యాల వినయ్ (26), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాలు (60) అవయవ దానంతో ఎనిమిది.మందికి పునర్జన్మను ప్రసాదించారు. తీవ్ర విషాదంలోనూ వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి చేసిన ఈ అవయవ దానం ఎంతో గొప్పది. ఆపదలో ఉన్నవారికి… pic.twitter.com/fhmoBnOSMq కామారెడ్డి జిల్లా శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన కుడిక్యాల వినయ్ (26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 16న బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఇంట్లోనే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించింది. సెప్టెంబర్ 19న వైద్యులు వినయ్‌ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ సమయంలో ఆయన తండ్రి కుడిక్యాల మోహన్ అవయవ దానానికి అంగీకరించారు. దీంతో వినయ్ రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులను దానం చేశారు. వీటి ద్వారా ఐదుగురు అవసరమైన రోగులకు అవయవాలు లభించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు, పోచంపల్లి ప్రాంతానికి చెందిన పద్మ ఆండాలు (60) తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మాట్లాడలేని స్థితికి చేరుకుని సెప్టెంబర్ 17న ఇంట్లోనే స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సెప్టెంబర్ 19న వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఆమె కుమారుడు పద్మ వినోద్ కుమార్ తల్లి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయాన్ని దానం చేయగా.. ముగ్గురు రోగులకు అవయవాలు లభించాయి. అవయవ దానం ద్వారా ఒకరి జీవితం ముగిసిన తర్వాత కూడా మరికొందరి జీవితాల్లో ఆశను కొనసాగించే అవకాశం ఉంటుందని సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయిన బాధలోనూ ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న ఆలోచనతో వినయ్, పద్మ ఆండాలు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తమ ఆప్తుల అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మంది జీవితాల్లో కొత్త ఆశలు నింపిన ఈ కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు