హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవికి దూరమైన దానం నాగేందర్ ఉప ఎన్నికకు ఖైరతాబాద్ సిద్ధం.. మళ్లీ బరిలోకి దిగుతానన్న దానం కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ.. అభ్యర్థి ఎంపికపై ఆసక్తికర చర్చ ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు పార్టీల్లోనూ మొదలైన రాజకీయ కసరత్తు బీఆర్‌ఎస్, బీజేపీ కూడా వ్యూహాలకు పదును.. మారనున్న రాజకీయ సమీకరణాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికల సందడి మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడంతో నియోజకవర్గం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు కోర్టు స్పష్టం చేయడంతో తదుపరి ప్రక్రియపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అయితే 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. స్పీకర్ ఉత్తర్వులను పక్కనపెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పు ప్రకారం దానం నాగేందర్ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది. అదే సమయంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి పంపాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘమే ప్రకటించాల్సి ఉంటుంది. నియోజకవర్గం ఖాళీపై అధికారిక ప్రక్రియ పూర్తయ్యాకే తదుపరి ఎన్నికల కార్యక్రమం స్పష్టతకు రానుంది. హైకోర్టు తీర్పు అనంతరం దానం నాగేందర్ మాత్రం రాజకీయంగా వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వలేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పుడు తాను మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని, ప్రజల తీర్పును కోరుతానని చెప్పారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే అంశంపై దానం నాగేందర్ స్పష్టత ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు ఖైరతాబాద్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతారా? అనే ప్రశ్నకు ప్రస్తుతం అధికారిక సమాధానం లేదు. అయితే ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో ఉప ఎన్నికలో పార్టీ టికెట్ అంశంపై చర్చలు సహజంగానే మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లోనూ ఈ