మెట్‌పల్లి, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం, శిక్షణ, అవకాశాలు కల్పిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తారని జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెట్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం నుంచి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. కొత్త బస్టాండ్, శాస్త్రి విగ్రహం, కూరగాయల మార్కెట్ మీదుగా జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవ లేదని, సరైన అవకాశాలు లభిస్తే ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గజల్ రాందాస్, జ్ఞానేశ్వర్, కొమురయ్య, కార్తీక్, క్రీడాకారుల తల్లిదండ్రులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు