Kaizer News

Vikarabad: ట్రాఫిక్ పద్మవ్యూహంలో వికారాబాద్ నరకం చ

Vikarabad: ట్రాఫిక్ పద్మవ్యూహంలో వికారాబాద్ నరకం చూస్తున్న ప్రజలు!

· City - Hyderabad · hmtvlive.com

Vikarabad: రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌తో వికారాబాద్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు నిమిషాల్లో దాటిపోయే ప్రధాన రహదారులు ఇప్పుడు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యంగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఎంఆర్పీ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు చేరుకోవడానికే దాదాపు అరగంట సమయం పట్టిందని వాహనదారులు చెబుతున్నారు. రోడ్డుపై ఎటు చూసినా వాహనాలే కనిపించడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈరోజు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర విందులు ఎక్కువగా ఉండటం ట్రాఫిక్ పెరగడానికి ఒక కారణం కావచ్చు. కానీ సమస్య ఒక్కరోజుదే కాదన్నది వికారాబాద్ ప్రజల ప్రధాన ఆవేదన. సాధారణ రోజుల్లోనూ ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. పట్టణం విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల అభివృద్ధి జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇంకెంతకాలం ఈ ట్రాఫిక్ నరకం..? ప్రధాన చౌరస్తాలను విస్తరిస్తారా? ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తారా? రద్దీ సమయాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను నియమిస్తారా? పార్కింగ్, ఆక్రమణలు, రోడ్డు పక్కన అడ్డంకులపై చర్యలు తీసుకుంటారా? ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేస్తారా? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, ఇతర ఎమర్జెన్సీ వాహనాలు ఇలాంటి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సమస్య మరింత జఠిలం కాకముందే అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని వికారాబాద్ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అభివృద్ధి చెందాలి. కానీ ఆ అభివృద్ధి ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారకూడదు. ప్రజలు రోడ్లపై గంటలు గడిపే పరిస్థితి రాకముందే చర్యలు మొదలవ్వాలి..!

Original source: hmtvlive.com
Read more on Kaizer News