Kaizer News

అంగన్వాడీలకు ఉచిత విద్యుత్‌ వెలుగులు..

అంగన్వాడీలకు ఉచిత విద్యుత్‌ వెలుగులు..

· City - Hyderabad · prabhanews.com

కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు కేసముద్రం, ఆంధ్రప్రభ: చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు అందిస్తున్నట్లు మహబూబాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దర్శన్‌కుమార్‌ తెలిపారు. మహబూబాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని మొత్తం 927 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాల పూర్వ విద్య, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు విద్యుత్‌ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో అంగన్వాడి కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దీంతో చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యా, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారని పేర్కొన్నారు. అంగన్వాడి కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా విద్యుత్‌ సౌకర్యం దోహదపడుతుందని దర్శన్‌కుమార్‌ తెలిపారు. చిన్నారులకు పోషకాహారం తయారు చేయడం, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. చిన్నారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ సర్కిల్‌ పరిధిలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రం విద్యుత్‌ వెలుగులతో ఉండేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కేసముద్రం పరిధిలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ కన్స్ట్రక్షన్‌ మహబూబాబాద్‌ ఐలయ్య ఆధ్వర్యంలో ధాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ పథకంలో భాగంగా 87 అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ మీటర్లు బిగించి కనెక్షన్లు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈ కన్స్ట్రక్షన్‌ వెంకటరమణ, ఏడీఈ ఆపరేషన్‌ కేసముద్రం రాములునాయక్‌, రాజు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News