Kaizer News

బషీర్‌బాగ్‌ పోరాట ఫలితమే ఉచిత కరెంట్‌

బషీర్‌బాగ్‌ పోరాట ఫలితమే ఉచిత కరెంట్‌

· City - Hyderabad · ntnews.com

కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంసరణల చట్టాన్ని వెంటనే వెనకి తీసుకోవాలి విద్యుత్తు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో వామపక్ష పార్టీల నేతలు హైదరాబాద్‌, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : బషీర్‌బాగ్‌ విద్యుత్తు పోరాట ఫలితంగానే ప్రస్తుతం రైతులకు ఉచిత కరెంటు పథకం అమలవుతున్నదని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. విద్యుత్తు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ అంబేదర్‌ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రం విద్యుత్తు సంసరణల పేరుతో కార్పొరేట్‌ శక్తులకు విద్యుత్తు రంగాన్ని అప్పజెప్పి కోట్లాది రూపాయలు ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి నెలనెలా డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. 26 ఏండ్ల క్రితం చంద్రబాబు విద్యుత్తు చార్జీలు పెంచడం మూలంగా లక్షలాది మంది ప్రజలు తమ నిరసనగళాన్ని వినిపించారని, వారిపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పటికీ మొకవోని ధైర్యంతో కదం తొక్కినట్టు గుర్తుచేశారు. కేంద్రం ఒకవైపు పెట్రో పెంచుతూ, మరోవైపు విద్యుత్తు సంసరణల పేరుతో మరింత భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నదని, వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయా పార్టీల నాయకులు ఝాన్సీ, హన్మేశ్‌, చంద్రశేఖర్‌, సుధాకర్‌, తేజ, షేక్‌షావలి, వీఎస్‌ బోస్‌, స్టాలిన్‌, పల్లె నర్సింహ, శ్రీకాంత్‌, కాంపల్లి శ్రీనివాస్‌, వెంకటస్వామి, బొడ్డుపల్లి కిషన్‌, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, వెంకటయ్య పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News