అవి యుద్ధ నేరాలే ! ? Andhra Prabha Top Story ఇరాన్‌పై యుద్ధం ఆరంభంలో అమెరికా జరిపిన రెండు దాడులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఓ ప్రాథమిక పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న దాడి సహా.. రెండు అమెరికా దాడులు యుద్ధ నేరాలై ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిజ నిర్ధారణ బృందం తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. మరోవైపు.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలు కూడా మానవత్వానికి వ్యతిరేక నేరాల పరిధిలోకి రావొచ్చని పేర్కొంది. ఒకవైపు అమెరికా సైనిక దాడులపై యుద్ధ నేరాల అనుమానాలు.. మరోవైపు సొంత ప్రజలపై ఇరాన్ ప్రభుత్వ అణచివేతపై తీవ్రమైన ఆరోపణలు.. వెరసి ఇరు దేశాల వ్యవహారాలు అంతర్జాతీయ న్యాయ పరిశీలనకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఐరాస మానవ హక్కుల మండలికి సమర్పించనున్న ఈ నివేదికలోని అంశాలు.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వంటి న్యాయస్థానాల పరిశీలనకు ఉపయోగపడే అవకాశముంది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయ్యిబా ప్రాథమిక పాఠశాలపై అమెరికా దాడి జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో 120 మంది చిన్నారులు, 26 మంది ఉపాధ్యాయులు సహా కనీసం 156 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్యపై వేర్వేరు నివేదికల్లో స్వల్ప తేడాలున్నప్పటికీ.. ఇటీవలి అమెరికా సైనిక చరిత్రలో అత్యధిక పౌర ప్రాణనష్టం సంభవించిన ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశముంది. అదే రోజు దక్షిణ ఇరాన్‌లోని లామెర్డ్ నగరంలో ఓ క్రీడా కేంద్రం, నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన మరో అమెరికా దాడిని కూడా ఐరాస బృందం పరిశీలించింది. ఈ ఘటనలో 22 మంది పౌరులు మరణించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ రెండు దాడులపై పరిశీలించిన అనంతరం.. పౌరుల ప్రాణనష్టం, గాయాలు లేదా పౌర ఆస్తుల విధ్వంసానికి దారితీసే విచక్షణారహిత దాడులకు అమెరికా పాల్పడి ఉండొచ్చని విశ్వసించేందుకు సహేతుకమైన ఆధారాలున్నాయని దర్యాప్తు బృందం పేర్కొంది. అయితే, ఇవి తుది న్యాయస్థాన తీర్పులు కాకుండా.. స్వతంత్ర దర్యాప్తు బృందం చేసిన ప్రాథమిక న్యాయపరమైన నిర్ధారణలుగా చూడాల్సి ఉంటుంది. ఐరాస నివేదికలోని అభిప్రాయాలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘర్షణలో యుద్ధ నేరాలకు పాల్పడింది ఇరాన్ ప్రభుత్వమేనని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు. సొంత ప్రజలను వేలాది మందిని హతమార్చడం, విదేశాల్లో అమెరికన్లను చంపడం, హోర్ముజ్ జలసంధిలో ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, ప్రాంతీయ పొరుగు దేశాలపై విచక్షణారహిత దాడులు చేయడం వంటి ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని ఎప్పటికీ కలిగి ఉండకుండా అధ్యక్షుడు ట్రంప్ ధైర్యంగా చర్యలు తీసుకుంటున్నారని.. తద్వారా ప్రపంచాన్ని మరింత సురక్షితంగా, స్థిరంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని కెల్లీ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు కూడా ఈ నివేదికలోని నిర్ధారణలకు ట్రంప్ ప్రభుత్వం విశ్వసనీయత ఇవ్వడం లేదని సీఎన్‌ఎన్‌కు తెలిపారు. 2025 ఫిబ్రవరిలోనే ట్రంప్ ప్రభుత్వం ఐరాస మానవ హక్కుల మండలి నుంచి అమెరికా వైదొ