Shorts ఎల్బీనగర్: జీవో 118 పరిధిలోని బాధిత కాలనీల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు శుక్రవారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మధుయాష్కీ గౌడ్ బాధిత కాలనీల ప్రతినిధులతో కలిసి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యను వివరించారు. గతంలో జారీ చేసిన జీవో 118, డీడ్ ఆఫ్ కన్వేయన్స్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. 22-ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని మధుయాష్కీ గౌడ్, బాధిత కాలనీల ప్రతినిధులు కోరారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల సూచనలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైపవర్ కమిటీ అధికారులను ఆదేశించినట్లు మధుయాష్కీ తెలిపారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కూడా కలిసి సమస్యపై వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం జీవో 118 తీసుకొచ్చిందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. హుడా లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. జీవో 118తో సంబంధం లేకుండా నూతన హక్కు పత్రాలు అందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 బాధిత కాలనీల ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారంపై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో బాధిత కాలనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై బాధితులతో మాట్లాడనున్నారని, నూతన హక్కు పత్రాల పంపిణీపై వివరాలు వెల్లడించనున్నారని తెలిపారు