ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో నెలకొన్న విషాద పరిస్థితుల నేపథ్యంలో సద్గురు నిర్వహించిన ‘నేపాల్‌కు సంఘీభావం’ కార్యక్రమంలో నటి మనీషా కొయిరాలా భావోద్వేగంగా మాట్లాడారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు గురూజీ నన్ను పిలిచినప్పుడు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడికి వచ్చాను. మేము అనుభవిస్తున్న బాధ అపారమైనది. దాన్ని మాటల్లో చెప్పలేం. నేను పూర్తిగా నిశ్చేష్టురాలినయ్యాను. ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళంలో ఉన్నాను’’ అని మనీషా కొయిరాలా అన్నారు. తమ బాధను తగ్గించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ‘‘దేవుడా.. దయచేసి మా బాధను కొంచెమైనా తగ్గించవా? నా భావాలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. ఈ జీవితం మమ్మల్ని ఇంకా ఎంత బాధను భరించమని అడుగుతుందో?’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాల్సిందేనని మనీషా అన్నారు. ‘‘సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడం తప్ప మనకు మరో మార్గం లేదు. మనలోని శక్తినంతా కూడగట్టుకుని.. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగాలి. మన దేశం అదే చేస్తుంది. మన ప్రజలు కూడా అదే చేస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు