Kaizer News

Vanasthalipuram: డెలివరీ బాయ్ అనుమానాస్పద ఆత్మహత్య

Vanasthalipuram: డెలివరీ బాయ్ అనుమానాస్పద ఆత్మహత్య: మన్సూరాబాద్‌లో విషాదం!

· City - Hyderabad · hmtvlive.com

Shorts వనస్థలిపురం: మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ గణేష్‌నగర్‌లో చోటుచేసుకుంది. అయితే యువకుడి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గణేష్‌నగర్‌కు చెందిన కూరాకుల జయ (42) తన కుమారుడు రాజేశ్ (21), కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. రాజేశ్ జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజేశ్‌కు తల్లి భోజనం పెట్టింది. అనంతరం ఆమె కొద్దిసేపు బయటకు వెళ్లి పొరుగువారితో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చింది. అర్థగంట తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా రాజేశ్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పొరుగువారి సహాయంతో అతడిని కిందికి దించి వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు సీఐ రవిబాబు తెలిపారు. రాజేశ్ మృతిపై సమాచారం తెలుసుకున్న ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ గణేష్‌నగర్‌లోని మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజేశ్ ఆత్మహత్యపై తల్లి ఎలాంటి అనుమానం వ్యక్తం చేయడం లేదని, అయితే మృతుడి స్నేహితులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఓ కారును బైక్‌తో ఢీకొన్న ఘటనకు సంబంధించి రాజేశ్‌ను కొందరు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. మృతదేహంపై గాయాలున్నట్లు, ఎవరో కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజేశ్ ఆత్మహత్య కేసును కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కుతాడి కుమార్ కోరారు. మృతుడి కుటుంబానికి ఎరుకల సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News