Kaizer News

Viral News | నేపాల్ వ‌ర‌ద‌ల నుంచి ఐదుగురి ప్రాణాలు

Viral News | నేపాల్ వ‌ర‌ద‌ల నుంచి ఐదుగురి ప్రాణాలు కాపాడిన టీ.. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం..!

· National - India · ntnews.com

Viral News : టీ (Tea) తాగితే కొంద‌రికి త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. కొంద‌రికి నిద్ర‌మ‌బ్బు తొల‌గిపోతుంది. మ‌రికొంద‌రిలో మెద‌డు ఉత్తేజిత‌మ‌వుతుంది. అందుకే మ‌న‌లో చాలామంది టీ కోసం వెంప‌ర్లాడుతుంటారు. ఇందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సింది ఏమీ లేదు. కానీ నేపాల్‌ (Nepal) లో మాత్రం అదే టీ ఐదుగురి ప్రాణాలు కాపాడింది. ‘టీ ఏమిటి..? ప్రాణాలు కాపాడటం ఏమిటి..?’ అని ఆశ్చ‌ర్యపోతున్నారా..? కానీ అదే నిజం. టీ కోసం ఆగిన ఐదుగురు స్నేహితులు వ‌ర‌ద‌లో గ‌ల్లంతు కాకుండా త‌ప్పించుకున్నారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. టీ కోసం ఆ 15 నిమిషాలు ఆగ‌క‌పోయి ఉంటే ఆ ఐదుగురు కూడా గ‌ల్లంత‌య్యేవారు. వివరాల్లోకి వెళ్తే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు ఆగ‌స్టు 21న నేపాల్‌కు విహార‌యాత్ర‌కు బ‌య‌లుదేరారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని మానా క్యాంప్ ప్రాంతానికి చెందిన నారాయణ్ సేన్ (53), దినేష్ ఓఝా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేష్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు వారిలో ఉన్నారు. పశుపతినాథ్, మనోకామన వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వారు అక్క‌డ‌ ఒక కారును అద్దెకు తీసుకున్నారు. ఆగస్టు 26న ఉదయం వారు భొటెకోశి న‌దివైపు బ‌య‌లుదేరారు. స‌రిగ్గా 9:30 నుంచి 10 గంటల మ‌ధ్య‌ సమయంలో మార్గ‌మ‌ధ్య‌లో ధాదింగ్ జిల్లాలోని మలేఖు పట్టణంలో ఒక హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. అదే వారిని పెను ప్రమాదం నుంచి రక్షించింది. వారు టీ తాగుతున్న స‌మ‌యంలో న‌ది ఉప్పొంగి జ‌ల ప్ర‌ళ‌యం సృష్టించింది. వారు గ‌నుక టీ కోసం ఆగ‌క‌పోయి ఉంటే జ‌ల విల‌యంలో విల‌విల్లాడుతూ ప్రాణాలు కోల్పోయేవారు. “మేం టీ కోసం ఆగడం మా అదృష్టం. ఒకవేళ 10-15 నిమిషాలు ముందుగా బయలుదేరి ఉంటే వరదల్లో చిక్కుకుపోయి ఉండేవాళ్లం. అక్కడ ఆగకపోయి ఉంటే ఏమయ్యేదో ఊహించుకోలేకపోతున్నాం” అని బృందంలోని నారాయణ్ సేన్ తెలిపారు. వారు హోటల్‌లో ఉండగానే భోటే కోశి, త్రిశూలి నదులకు ఆకస్మిక వరదలు వచ్చి ముందున్న వంతెన కొట్టుకుపోయింది. ఎత్త‌యిన‌ ప్రదేశం నుంచి చూస్తుండగానే త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చింది. కార్లు, మృతదేహాలు, చెత్తాచెదారం నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని వారు కళ్లారా చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం రెండు రాత్రులు అద్దె కారులోనే భయంతో గడిపారు. ఇంటర్నెట్, భారత ప్రభుత్వ హెల్ప్‌లైన్ ద్వారా తమ కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఆ భయానక దృశ్యాలను మాటల్లో వర్ణించలేమని, తామంతా శివుడి నామాన్ని స్మరించుకుంటూ గడిపామని బృందంలోని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ ఠాకూర్ చెప్పారు. అదే సమయంలో రక్షా బంధన్ సందర్భంగా మహిళా భద్రతా సిబ్బంది తమ చేతులకు రాఖీలు కట్టడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని వారు గుర్తుచేసుకున్నారు. స్థానికులు, అధికారుల సహాయంతో వారు ఆగస్టు 28న నేపాల్ నుంచి బయలుదేరి శనివారం నాటికి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ కళ్లారా చూసిన ఆ బీభత్సం తమను జీవితాంతం వెంటాడుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News