సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: పీఆర్‌టీయూటీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు ఏనుగుల భూమన్న సంఘ నాయకులతో కలిసి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం ఈ మహాధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీని వెంటనే ప్రకటించడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల సమస్యను పరిష్కరించడం తదితర ప్రధాన డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిర్పూర్ (యు) మండలంలోని ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆడజంగు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం దత్తు, మండల కార్యవర్గ సభ్యులు కవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు