Kaizer News

మతాలు, ఆచారాలు వేరైనా అందరిదీ ఒకే గొంతుక..భారత్ అన

మతాలు, ఆచారాలు వేరైనా అందరిదీ ఒకే గొంతుక..భారత్ అన్ని వర్గాల ఇల్లు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

· National - India · v6velugu.com

హైదరాబాద్,వెలుగు:మనదేశం ఎప్పుడూ ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదని, అన్ని మతాలు, సంస్కృతులను తనలో ఇముడ్చుకుంటూ వస్తోందని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవంతో జీవించడమే సనాతన ధర్మం నేర్పిన అసలు పాఠమని ఆయన స్పష్టం చేశారు. విద్వేషాలను, శత్రుత్వాలను పక్కన పెట్టి అందరూ ఒక్కటే అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని మాట్లాడారు. జన్మభూమి భారత్ అయినప్పటికీ.. అమెరికాలోని ప్రవాస భారతీయులు తమ కర్మభూమి పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు. దేశంలో ఎన్నో మతాలు, భాషలు, ఆచారాల వైవిధ్యాన్ని మనం ఎప్పుడూ విభేదాలుగా చూడలేదని, దాన్నే మన ఐక్యతకు అలంకరణగా భావిస్తామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అసలైన బలమని ఆయన చెప్పారు. దేశ సరిహద్దులు, సంస్కృతులకు అతీతంగా మానవాళి అంతా ఒక్కటే అనే భావనను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన గుర్తుచేశారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు తాము ఉంటున్న దేశానికి విధేయులుగా ఉంటూనే, భారతదేశపు విశాల దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట పరిస్థితులకు కేవలం భౌతిక అభివృద్ధి, సంపదలు మాత్రమే పరిష్కారం కాబోవని భగవత్ హెచ్చరించారు. ప్రకృతితో మమేకమై, తోటి మానవుల శ్రేయస్సును కోరుకునే తత్వమే మానవాళిని కాపాడుతుందన్నారు. ప్రవాస భారతీయులు భారతీయ సంస్కృతిలోని ఈ గొప్ప ఐక్యతా భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. భారత దేశంలో ముస్లింలకు చోటులేదని భావించేవాడు అసలు హిందువే కాదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో తాను మాట్లాడుతుండగా.. ‘మీరు హిందూ ఆర్గనైజేషన్, హిందూ రాష్ట్రం అని అంటారు, మరి మా ముస్లింల మాటేంటి? మమ్మల్ని దేశం నుంచి తరిమేస్తారా?’ అంటూ ఓ ముస్లిం వ్యక్తి తనను అడిగారని చెప్పారు. దానికి తాను ‘లేదు, అది హిందూత్వం కాదు. భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందూనైనా భావిస్తే, అతను అసలు హిందువే కాడు’ అని స్పష్టం చేసినట్టు వెల్లడించారు. మిమ్మల్ని మీరు హిందువుగా భావిస్తే అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేర్చుతాయని, ప్రతి మనిషికి సమాన గౌరవం ఉంటుందని నమ్మాలని పేర్కొన్నారు. సమాజంలో కనిపించే తేడాలన్నీ తాత్కాలికమేనని, సృష్టిలో మనుషులందరం ఒక్కటేననే సత్యాన్ని అందరూ గుర్తించాలని స్పష్టం చేశారు

Original source: v6velugu.com
Read more on Kaizer News