హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: గ్రామాల్లో ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో ఊరురా.. ‘బలగం’ సినిమా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించి సందడి చేయగా.. ఇప్పుడు అదే తరహాలో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి. గ్రామాల్లోని వినాయక వేడుకల్లో భాగంగా మండపాల వద్ద సినిమాలను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలు ప్రస్తుతం కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. గ్రామస్తులకు వినోద వేదికలుగానూ మారుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి పలు గ్రామాల్లో ‘ఇరుముడి’ సినిమాను తెరపై ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి గ్రామస్తులు మండపాల వద్దకు చేరుకుని సినిమాను వీక్షిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా సినిమా ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ‘బలగం’ సినిమా గతంలో గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబ బంధాలు, ప్రేమను చూపుతూ.. అపట్లో సినిమా థియేటర్లలో ఆలరించిన సినిమా.. ఓటీటీకి వచ్చిన తరువాత పలు గ్రామాల్లో పెద్ద తెరలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలంతా కలిసి సినిమా చూసిన సందర్భాలు కనిపించాయి. ఇప్పుడు అదే తరహాలో ‘ఇరుముడి’ సినిమా కూడా గ్రామాల్లో ప్రదర్శనకు వస్తుండటంతో ఈ విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పండుగ వాతావరణంలో గ్రామస్తులంతా ఒకచోట చేరి సినిమా చూడటం సామాజిక అనుబంధాలను కూడా పెంచుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇరుముడి సినిమా ఆదరణకు ప్రధాన కారణం భక్తి, కుటుంబ భావోద్వేగాలు, తండ్రి–కూతురు అనుబంధం . అయ్యప్ప భక్తి, దీక్ష, ఇరుముడి, శబరిమల యాత్ర వంటి అంశాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైనవే కావడంతో సినిమా కథతో చాలామంది తమ అనుభవాలను అనుసంధానం చేసుకుంటున్నారు. అంతేకాదు.. సినిమా OTTలోనూ దూసుకెళ్తోంది. థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికపై కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ‘ఇరుముడి’పై ఆసక్తి కొనసాగుతోంది. గ్రామాల్లో సామూహిక ప్రదర్శనలు, OTT ఆదరణతో సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది