హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్న ఎమ్మెల్యే హైదరాబాద్, ఆంధ్రప్రభ : తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికలు తనకు కొత్త కాదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల్లోకి వెళ్లి పోరాడతానని పేర్కొన్నారు. “ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాను. ఇక్కడి వరకు పోరాడుతూనే వచ్చాను. ఈ ఎన్నికల్లోనూ పోరాడతాను. మళ్లీ విజయం సాధిస్తాను” అని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన చేరికల నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మార్పు అంశంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ న్యాయపరమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది