Real Estate: విశ్వనగరం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, ఊహకందని రీతిలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి రాయదుర్గంలో ఒక్క ఎకరం భూమి ధర ఏకంగా రూ.269 కోట్లు పలికి అందరినీ విస్తుపోయేలా చేసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో నిర్వహించిన భూముల వేలంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు, ప్రముఖ రియల్టీ దిగ్గజాలు పోటీపడ్డాయి. రాయదుర్గం కారిడార్‌పై తమకున్న నమ్మకాన్ని, ఆసక్తిని ఈ వేలం స్పష్టం చేసింది. 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ P2 వేలంలో ఎకరాకు రూ.269 కోట్ల రికార్డు ధర లభించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరాం బిల్డర్స్ ఈ స్థలాన్ని మొత్తం రూ.1,447.22 కోట్లకు సొంతం చేసుకుంది. గత వారమే జరిగిన ప్లాట్ P1 వేలంలో ఎకరా రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు దక్కాయి. ఇప్పటికే ఇందులో 25 శాతం మొదటి విడత చెల్లింపు కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వు ధర కంటే ఏకంగా 52.3 శాతం అధికంగా ధర పలికింది. రెండు విడతల్లో కలిపి కేవలం 10.63 ఎకరాల భూమి వేలం ద్వారా సగటున ఎకరాకు రూ.266.53 కోట్ల చొప్పున ప్రభుత్వం రూ.2,833.22 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు ఆదాయాన్ని సమకూర్చుకుంది. కేవలం వారం వ్యవధిలోనే రెండు సార్లు ఆల్‌టైమ్ రికార్డులు తిరగరాయడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు, మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్ భవిష్యత్తుకు పట్టిన నిలువుటద్దం. రాయదుర్గంలో స్థలం సంపాదించడం ఇప్పుడు మామూలు విషయం కాదని, అది పసిడి కంటే విలువైనదని ఈ వేలం మరోసారి నిరూపించింది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది